కెనడా రాజకీయాల్లో అనూహ్య పరిణామం: ట్రూడో రాజీనామా
కెనడా రాజకీయాల్లో అనూహ్య పరిణామం: ట్రూడో రాజీనామా
కెనడా రాజకీయాల్లో చరిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. సొంతపార్టీ నాయకులు ట్రూడోపై గత కొన్ని నెలలుగా విమర్శలు గుప్పించడమే కాకుండా, ఆయనను పదవి నుంచి తప్పించాలంటూ నిరసనలు చేపడుతున్నారు. ఈ ఒత్తిళ్ల మధ్య ట్రూడో తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రతిపక్షాలు మాత్రం ట్రూడో రాజీనామా వెనుక ప్రజల్లో ఆయనపై పెరిగిన వ్యతిరేకత కారణమని ఆరోపిస్తున్నాయి. ఇక లిబరల్ పార్టీ ఎన్నికల్లో విజయావకాశాలు సన్నగిల్లిన కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వారు విమర్శిస్తున్నారు. అయితే, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత మాత్రమే తన పదవులకు రాజీనామా చేస్తానని ట్రూడో స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఆయన దాదాపు పదేళ్ల పాలనకు ముగింపు పలికినట్లైంది.
రాజీనామా వెనుక కారణాలు
ట్రూడో మాట్లాడుతూ, కుటుంబంతో నిశితంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన విజయాల వెనుక కుటుంబ మద్దతే ప్రధాన కారణమని, రాజీనామా నిర్ణయాన్ని పిల్లలకు చెప్పడం చాలా భావోద్వేగమైన అంశంగా మారిందని తెలిపారు. అంతర్గత పార్టీ విభేదాలు తీవ్రంగా పెరిగిన కారణంగా తన నాయకత్వం కెనడియన్లకు ఉత్తమంగా పనికి రాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
పాలనలో సాధించిన విజయాలు
ట్రూడో తన పాలనలో కెనడా అభివృద్ధికి ఎంతో కృషి చేశానని పేర్కొన్నారు. పేదరికాన్ని తగ్గించడం, ఉద్యోగావకాశాలు పెంచడం వంటి పలు రంగాల్లో తన ప్రభుత్వం ముందడుగు వేసిందని అన్నారు. అయితే, పార్టీ నాయకత్వం నుంచి పదవి దిగాలని వస్తున్న ఒత్తిడులను ఆయన ఇక తట్టుకోలేకపోయారు.
భారత్-కెనడా సంబంధాలపై ప్రభావం
ట్రూడో ప్రధానిగా ఉన్న కాలంలో భారత్, కెనడా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత తీవ్రతరం చేశాయి. ట్రూడో ఈ అంశంలో భారత్‌పై దూకుడు ధోరణి ప్రదర్శించారని, కెనడాలోని సిక్కు సమాజం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలా చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.
లిబరల్ పార్టీకి ముందున్న సవాళ్లు
ట్రూడో రాజీనామాతో లిబరల్ పార్టీకి నాయకత్వ సమస్య నెలకొంది. కెనడా మాజీ ఉపప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నే తదుపరి నాయకులుగా పోటీ పడవచ్చని అంచనా. ట్రూడో తన స్థానంలో కొత్త నాయకుడు కెనడా రాజకీయాలకు శాంతి, స్థిరత్వాన్ని తీసుకురాగలడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముగిసిన అధ్యాయం
ట్రూడో మూడు సార్లు ప్రధానిగా సేవలందించి, దేశీయంగా మరియు అంతర్జాతీయంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న నేత. ఆయన రాజీనామాతో కెనడా రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.